4/3/13

శ్రధ్ధాంజలి

వాళ్ళ నాన్న గారి చిటికెన వేలు పట్టుకుని బజార్లో అది కావాలీ...ఇది కావాలి అని పేచీలు పెడుతున్న బుల్ల్లి బావ, ఇంకా నాన్నగారి మనసులో మెదులుతూనే వున్నాడు...

నాన్నతో పాటు పెళ్ళి చూపులకొచ్చిన చిట్టి అల్లరి పిడుగు, అమ్మ కళ్ళల్లో ఇంకా కదులుతూనే వున్నాడు...

నీ పేరేవిటే 'స్ఫురించడం' లేదూ అంటూ ఆటపట్టించే తన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఇంకా పెదవులమీద చిరునవ్వులు పూయిస్తూనే వున్నాయి...

నా పెళ్ళికి అడక్కుండానే రెండు రోజుల ముందు సెలవు పెట్టుకుని వచ్చి...నీకు సాయం చేద్దామని ముందే ఇంటికి వచ్చా బావా అని ఫోన్ చేసి చెప్పినప్పుడు నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం, ధైర్యం ఇంకా నా జ్ఞాపకాల్లో సజీవంగా అలానే వున్నాయి...

ఎవరి పనుల్లో వాళ్ళు పడి చెల్లాచెదురైపోయిన బంధువులందర్నీ ఒక చోటకి చేర్చి ఫామిలీ రీయూనియన్ అని తను చేసిన సందడి అందరి గుండెల్లో ఇంకా భద్రంగానే వుంది...

మెరుపులా ప్రత్యక్షమయ్యి...నాకోసమేనా అక్కా పకోడీలు చేస్తున్నావ్ అని చనువుగా వంటింట్లో అమ్మని పలకరించేసి...నాన్నతో నాలుగు కబుర్లు చెప్పేసి...ఫోన్ లో నన్ను పలకరించేసి అప్పటివరకూ వుదాసీనం గా వున్న మా మనసుల్లో వుత్సాహం నింపేసి...ఏదో పని గుర్తొచ్చిందంటూ చటుక్కున మాయం అయిపోయే ఆ అనుకోని అతిధి పలకరింపులు, ఇంక కనపడవని నమ్మడానికి  వొప్పుకోనని మనసు మొరాయిస్తోంది...

తను ఈ ప్రపంచం తో సంబంధం తెంచేసుకుని పదిరోజులు దాటిపోయినా ... ఎప్పుడూ నవ్వుతూ పలకరించే తన గొంతు మా చెవుల్లో పదిలంగానే వుండిపోయింది...పైకి వేలాకోళాలాడినా... తన మాటల వెనక వున్న అభిమానం మా గుండెల్లో చెక్కు చెదరకుండా అలాగే వుంది...

మరణం మనిషితో పాటూ ప్రాణం ఒక్కటే తీస్కుకుపోతుందా అంటే...కొందరి జీవితాల్లో సంతోషం, నమ్మకం, ఆసరా కూడా ఆ ప్రాణం తనతో పాటూ లాక్కెళ్ళిపోతుంది...కొందరు మనుషులు మాత్రం...మృత్యువుకతీతంగా  తమదైన ముద్ర  తోటివారికి విడిచిపెట్టి  మన మధ్యలోనుండి చెప్పకుండానే మాయమైపోయినా... మనసు పొరల్లో గూడు కట్టుకుని మన చుట్టూనే తిరుగుతూ వుంటారు...

నువ్వు మా మధ్య లేకపోయినా, వున్నన్నాళ్ళూ నవ్వుతూ నవ్విస్తూ చేతనైన సాయం చేస్తూ బతకాలని... 'నన్ను చూసి నేర్చుకో' అని నోటితో చెప్పకుండానే ...జీవించి చూపించి నువ్వు ఇచ్చిన స్ఫూర్తి మాతో ఎప్పటికీ వుండిపోతుంది....

(పది రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన మా శర్మ మావయ్యకి శ్రద్ధాంజలి...ఆయన కుటుంబానికి...ఈ లోటుని తట్టుకునే శక్తి ని, ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ...)




2/20/13

చిలక పలులకులు - 2

నా చిన్నప్పుడు నేనన్న మాటలు...చేసిన చిలిపి పనులు ఇప్పటికీ మా అమ్మ కధలు కధలు గా చెబుతూ వుంటుంది. కానీ నాకు ఇప్పుడే ఏదన్నా వెతుకుతూ వెతుకుతూ అసలేది వెతుకుతున్నానో మర్చిపోవడం, కొంతమంది పేర్లు గుర్తుకు రాకపోవడం వచ్చేసి, నా మెదడు మీద నమ్మకం తగ్గుతోంది ఈ మధ్య. నా కూతురు పెద్దదయ్యాక దాని చిలక పలుకులు దానికి గుర్తుంచుకుని చెప్పగలనో లేదో అని ఇలా రాసి దాచుకుంటున్నాను. ఆ మధ్య మరీ బుజ్జి చిలక పలుకులు రాసుకున్నా..ఇప్పుడు కాస్త తెలిసీ తెలియని చిట్టి పొట్టి మాటలు మాట్లాడే చిలకా ఇంకా దాని నేస్తాల కబుర్లు...
ఇండియా లో ఇంచుమించు రెండేళ్ళు వుండడం వల్ల మా చిట్టితల్లికి తెలుగు చక్కగా వచ్చేసింది. ఇక్కడకొచ్చి డేకేర్ కి వెళ్ళడం మొదలెట్టాక దాని మొదటి ఛాలెంజ్ తోటి పిల్లలతో వాళ్ళకర్ధమయ్యే భాషలో మాట్లాడ్డం. ఇంటికొచ్చాక ప్రతీదీ ఇంగ్లిష్ లో ఎమంటారో అడుగుతూ వుండేది కొన్నాళ్ళు. కాసిని రోజులు గడిచేసరికి సొంత ప్రయోగాలు మొదలెట్టేసింది. మా వాడు పుట్టిన కొత్తలో దాని తో ఆడుకోడానికొచ్హ్చిన పాప where is your bother? what is he doing? అని అడిగింది...మా పిల్ల తడుముకోకుండా చెప్పింది My bother is milking అని...:)

వొకరోజు ఇద్దరు స్నేహితుల కుటుంబాలని భోజనానికి పిలిచాం. పిల్లలంతా కలిసి గోల గోల గా ఆడుకుంటున్నారు. కొంచెం సేపటికి అందులో పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని తప్పించుకుని ఆడుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. మా చిన్నప్పుడు పాపం మా పిన్ని కూతుర్ని ఇలాగే అప్పుడప్పుడూ ఏడిపించే వాళ్ళం :)... మా అమ్మాయి వెళ్ళి అందులో వొక పిల్లాడి తల్లి కి కంప్లయింట్...ఆంటీ అన్న నన్ను ఆడించడం లేదని. ఆవిడ నవ్వి, వెళ్ళి చెప్పూ ఇది మా ఇల్లూ...నన్నాడించకపోతే బయటకి పంపేస్తా అని...అని చెప్పి పంపేసారు...అది పిల్లలున్న గదిలోకి వెళ్ళి గట్టిగా చెప్పింది...ఇదిగో ఇది ఆంటీ వాళ్ళ ఇల్లంట...నన్నాడించకపోతే అందర్నీ బయటకి పంపేస్తా అని చెప్పమన్నారు అని అరిచింది...ఆ పిల్లలకి ఏమీ అర్ధం కాక తెల్ల మొహాలు వేసారు గానీ...పెద్దాళ్ళంతా వొకటే నవ్వు...

మొన్న శనివారం సాయంత్రం పాత స్నేహితులొచ్చారు. వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలు. పెద్దాడికి ఏడేళ్ళూ, చిన్నాడికి రెండున్నరా. అందరూ యధావిధి గా ఇల్లు పీకి పందిరేసే కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇంతలో మా బుడ్డోడు నిద్రకి పడ్డాడు. తమ్ముడు పడుకుంటున్నాడమ్మా గట్టిగా అరవకండీ అని రెండు మూడు సార్లు చెప్పినా మా మాటలు చెవికెక్కించుకునే పరిస్థితుల్లో ఎక్కడా లేరు. మా అమ్మాయి ని కాస్త గట్టిగా అరిచాను గొడవ ఆపమని. చిన్నోడికి వాళ్ళ అన్నని ఏదో అనేస్తున్నా అని కంగారొచ్చేసింది. అప్పటిదాకా ఏదో మూల వొక బొమ్మ పని పడుతున్న వాడల్లా వచ్చేసి నాకేసి కోపంగా వొక చూపు చూసి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని యుధ్ధానికొచ్చినట్టు నించుని stop it. This is my brother. అన్నాడు. వాడి మొహం చూస్తే భలే ముచ్చటేసింది. ఏమంటాడో చూద్దామని. No, this is my daughter. I can shout at her అన్నా మా పిల్ల చెయ్యి పట్టుకుని. వెంఠనే మా పిల్ల రెండో చెయ్యి పట్టుకుని stop it. This is my daughter అన్నాడు అదే చూపు కఅంటిన్యూ చేస్తూ...:)

నిన్న రాత్రి అందరూ పడకకి వుపక్రమించాక నేనింకా వంటింట్లో ఏదో సద్దుతుంటే మా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వొక సొరుగు లాగి ఏదో వెతికింది. ఏవిటి వెతుకుతున్నావ్ అంటే చెప్పదు. ఇదేనా అమ్మమ్మా అనుకుంటూ మిరియాల పాకెట్ పట్టికెళ్ళింది పడగ్గదిలోకి. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి అదక్కడ పడేసి ఇంకేదో వెతకడం మొదలెట్టింది. ఏవిటే అని మళ్ళీ కాస్త గొంతు పెంచి అడిగితే అమ్మమ్మ కి ఆవుండలు కావాలంట అంటుంది. ఇంతలో అమ్మ వచ్చింది. ఏవిటి తెమ్మన్నావమ్మా దాన్ని అంటే నేనేవి తెమ్మనలేదే ఆవులింతలొచ్చేస్తున్నాయ్ అన్నా అప్పట్నుండీ ఇలా అన్నీ తెచ్చేస్తోంది అన్నారు. ఆ ముక్క చెవిని పడగానే ఆ అవే ఆవలింతలు కావాలి. అని మొదలెట్టింది. మా అమ్మగారు ఈనో కలుపుకు తాగుతుంటే నాకూ ఆవలింతలు పెట్టమ్మమ్మా అని వొకటే గోల. ఆవలింతలంటే తాగేవో తినేవో కాదమ్మా అంటే వొక పట్టాన వొప్పుకోలేదు...:)

ఈ మధ్య ఇంగ్లిష్ బాగానే మాట్లాడేస్తోంది, తప్పులూ తడకలూ ఎన్ని దొర్లినా...ఇంటికొచ్చాక కూడా అదే భాషలో బాదేస్తుంటే ఎక్కడ చక్కగా వచ్చిన తెలుగు అప్పుడే మర్చిపోతుందో(కొన్నాళ్ళకెలాగూ తప్పదన్న కఠోర వాస్తవం తెలిసినా) అని భయమేసి ఇంటికొచ్చాక తెలుగు లోనే మాట్లాడాలి అని చెప్పాను. వాళ్ళ నాన్న దగ్గరకెళ్ళి అమ్మకి ఇంగ్లిష్ రాదు పాపం. నన్ను తెలుగులోనే మాట్లాడమంటోంది అని తేల్చి పారేసింది.



10/17/12

పుట్టినరోజు జేజేలు అరవై అయిదేళ్ళ పసి పిల్లాడికి




నేను పుట్టని క్రితం అమ్మా వాళ్ళూ పొదుపూ మదుపూ అనే బెంగలేమీ లేకుండా హాయిగా వుండేవారట...అలాంటి రోజుల్లో అమ్మ ఒక వారం gap లో రెండు జతల చెప్పులు కొనడం చూసి మా తాతగారు(అమ్మా వాళ్ళా నాన్నగారు) మా నాన్నతో మీకు అరడజను మంది ఆడపిల్లలు పుడితే తెలుస్తుందయ్యా డబ్బు విలువా అని కోప్పడారట. అప్పటికే పిల్లలు లేరని బెంగ పడుతున్న నాన్నగారు...మీ నోటిమాటన అలానే పుడితే బోల్డు సంతోషం అన్నారట.

ఇది జరిగిన చాలా ఏళ్ళకి నేను పుట్టగానే మా తాతగారు ఇన్నాళ్ళ ఎదురుచూపులకి "ఆడపిల్ల"పుట్టిందని నీరసం గా telegram ఇస్తే..మా నాన్నగారు మాత్రం ఎగిరి గంతేసి మహదానందం గా చదువుకుని పరిగెట్టుకుని వచ్చారట నన్ను చూడ్డానికి.

అది మొదలు ఎప్పుడూ నేను ఆడపిల్లని కాబట్టి అన్న feeling నాలో ఏ మూలా కలగకుండా పెంచారు నాన్న. చదవకపోతే అంట్లు తోముకుంటావ్ అని అమ్మ వెంట పడేదే గానీ నాన్న మాత్రం దానికి తెలుసు ఎప్పుడు చదువుకోవాలో అని ఒక్క మాట అనేవారు. ఆ ఒక్కమాటే నాకు బోలెడు responsibility నేర్పింది. school లో బెత్తం పట్టుకుని దబదబా బాదేసే మాస్టార్ల కన్నా...చిన్న మాట కూడా అనకుండా పిల్లల్లో బోలెడంత గౌరవాన్ని సంపాదించుకున్న ఆయన నడవడిక reserved గా వుండటంలోని గొప్పతనాన్ని నేర్పించింది. జీవితంలో అప్పు అన్నది చెయ్యకుండా బతికిన ఆయన జీవన విధానం Life planning నేర్పించింది. అల్ప సంతోషి అని అమ్మ ఎప్పుడూ కసురుకున్నా...చిన్న విషయానికే సంబరపడే ఆయన తత్వం సంతృప్తి లో వుండే ఆనందం, దాని విలువా తెలియజెప్పింది. ఒక వయసు వచ్చాక వాళ్ళకి తెలుసు career planning అని ఎప్పుడూ ఇది చదువు..ఇలానే చెయ్యి అని నిర్బంధించకుండా ఆయన నాకిచ్చిన స్వేఛ్చ నాకు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పించింది.


ఇన్ని నేర్పినా ఏనాడూ నీకింత చేసాను అని గొప్పలు చెప్పుకోని ఆయన వ్యక్తిత్వం నుండి నేర్చుకోవాల్సినది ఇంకా బోలెడంత.

ప్రతీ కూతురికీ నాన్నే మొదటి హీరో...ఇవాళ్టితో అరవై అయిదేళ్ళు నిండుతున్న (ఎప్పటికీ నా దృష్టిలో హీరో) నాన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు

4/11/12

పరుగాపి...




పొద్దున్నే అయిదింటికి అల్లారం లే లే అని కుదిపి కుదిపి, చెవినిల్లు కట్టుకుని పోరేస్తోంది. అసలే చలికాలం...దాని పీక నొక్కి ఇంకొక్క పదినిమిషాలు అని తనలో తనే గొణుక్కుని దుప్పట్లో దూరింది నందిని. నిన్న రాత్రి  కుక్కరు గిన్నెలు పొద్దున్న లేచి తోవుకోవచ్చులే అని బధ్ధకించి వదిలేసిన సంగతి గుర్తురాగానే లేవక తప్పదు బాబోయ్ అనుకుని వంటింట్లోకి పరిగెత్తి నిద్ర మత్తులో చల్ల నీళ్ళ కుళాయి తిప్పేసరికి 0 కన్నా తక్కువ వుష్ణొగ్రతలో నీళ్ళు చేతిమీద సూదుల్లా గుచ్చుకుని మత్తంతా ఒక్క నిమిషం లో వదిలిపోయింది...చలికి ఎండిపోయిన గిన్నెల్ని కసిగా తోవుతుంటే ఎందుకో అమ్మ మాటలు గుర్తొచ్చాయి..."రోజూ తెల్లవారుఝామునే చదువుకోడానికి లేవదీసి బాగా చదువుకుంటే నాకులా ఇలా అంట్లు తోవుకుంటూ బతకక్కర్లేదు...కాలు మీద కాలేసుకుని దర్జాగా వుండొచ్చు. చదువుకుంటాను మొర్రో అన్నా పట్టించుకోకుండా నా తరవాత ఇంకా నలుగురాడపిల్లలున్నారని చిన్నప్పుడే పెళ్ళి చేసి పడేశారు. నీకు అన్నీ అమర్చిపెట్టి చదువుకుని సుఖపడవే అంటే అంత గునుపేవిటే"...పుస్తకం వొళ్ళో పెట్టుకుని కునికిపాట్లు పడే తనకి రోజు వంటింట్లోంచి అదే సుప్రభాతం వినపడేది.
"చదువుకుని సుఖపడవే అంటే" అన్న మాట మళ్ళీ గుర్తొచ్చి చిన్నగా నిట్టూర్చింది కుక్కరు పొయ్యిమీదకెక్కిస్తూ...అదే అమ్మ ఇప్పుడు call చేసినప్పుడల్లా  "మా కన్నా మీరేం సుఖపడుతున్నారే" అని దీర్ఘం తీస్తుంది అని నవ్వుకుంటూ స్నానాలగదిలోకి దూరింది.

ఇంట్లో మిగిలిన ఇద్దర్నీ వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకి పంపి, చివరగా తన బాగ్గు హడావిడిగా సవిరిస్తూ ..ఛా రేపట్నుంచీ అన్నీ రాత్రే సద్దిపెట్టుకోవాలి అని రోజూలాగే తిట్టుకుంటూ, కనపడని ఆఫీసు బాడ్జ్ ని మొత్తానికి సాధించి హడావిడిగా పరిగెట్టి బయటపడింది. ఎప్పట్లాగే కాస్త లేటుగా ఆఫీసు చేరుకుని సీట్లో కూలబడింది, నేనేనా అందరికంటే ఆలస్యం అని కళ్ళతోనే చెక్ చేస్కుంటూ. ఏదో వొకరోజు తొమ్మిదింటికే స్టాటస్ మీటింగు పెట్టేస్తాడు బాసు గారు..నాకు సరదా తీరిపోతుంది అని తనని తనే తిట్టుకుంటూ ల్యాపీ తెరిచింది. మైల్ చెక్ చేస్కుంటూ, "ఒక పక్కన డెలివరీ డేటు దగ్గర పడుతుంటే ఇంకా రెక్వైర్మెంట్స్ మారుస్తున్నారు ఈ బిజినెస్ వాళ్ళకి పనీ పాటా లేదు" అని తిట్టుకుంటూ పనిలో పడింది.

స్వాతి "Lunch?" అని పింగ్ చేసేసరికి అప్పుడే లంచ్ టైం అయ్యిందా అని వాచ్ చూస్కుని, తట్టెడు పనుందికదా పోనీ డెస్కు దగ్గరే కానిచ్చేద్దామా అనుకుని వద్దులే రోజు మొత్తంలో ఈ గంటేగా కాస్త సరదాగా గడిపేది అనుకుని "ok" అని పింగ్ చేసి బాగ్గు తీస్కుని కాఫటేరియా వైపు నడిచింది. అప్పటికే దేసీ గ్రూపులో చాలా మంది చేరిపోయారు అక్కడ...నందినీ, స్వాతీ చాలా రోజులుగా కలిసి పని చేస్తున్నారు...చాలా మంది భారతీయులు అక్కడ చేరినా వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట కూచుని లంచ్ చేస్తున్నంత సేపూ పనిలోనూ ఇంట్లోనూ, ఎదురయ్యే కష్ట సుఖాలు కలబోసుకుంటూ వుంటారు.

ఇద్దరూ మాట్లాడుకుంటూ లంచ్ బాక్సులు విప్పుతుంటే వీళ్ళ పక్కనే వచ్చి కూచున్నాడు శ్రీకాంత్ పలకరింపు గా నవ్వుతూ, అతని బాక్సు విప్పుతుంటే ఘుమ ఘుమా వాసన వచ్చేసరికి ఏవి తెచ్చుకున్నాడబ్బా అని కాస్త కుతూహలం గా అతని బాక్సు లోకి తొంగి చూసింది స్వాతి. "ఆహా గుత్తి వంకాయ కూర"  పైకే అనేసింది...అసలే తనకి అదంటే ప్రాణం. అతను రుచి చూడండి, మా ఆవిడ చేసింది అని ఇద్దరికీ తలో కాస్తా వడ్డించాడు. ఈ స్వాతికి అస్సలు బుధ్ధిలేదు అనుకుంటూ మొహమాటం గా నవ్వింది నందిని. ఆ వేసిన కాస్త కూరా నొట్లో పెట్టుకుని చాలా బాగా చేశారండీ మీ ఆవిడ అంది. స్వాతి మాత్రం అంతటితో వదల్లేదు..."మీరెంత అదృష్టవంతులండీ...ఐతే కొత్త పెళ్ళికూతురు వంటలు అదరగొట్టేస్తోందన్నమాట" అంది శ్రీకాంత్ కి కొత్తగా పెళ్ళవడంతో... "ఆ... ఏవదృష్టమో లెండి వంటలొకటే ఆవిడ అదరగొట్టేది" అన్నాడు మహా నిరుత్సాహం గా...అదేవిటీ అలా అనేశాడు అన్నట్టు చూశారిద్దరూ అతనికేసి.

"బోల్డు చదువుకుంది...నిజం చెప్పాలంటే నాకన్నా అన్నీ మంచి గ్రేడులే...చక్కగా ఉద్యోగం చేస్తుంది...బోల్డు విలాసం గా బతకొచ్చు అనుకున్నా ఇప్పుడేమో మనకంత గండకత్తెరోమొచ్చిందీ అంటుంది ఎప్పుడు వుద్యోగం ప్రసక్తి తీస్కొచ్చినా". మరి పెళ్ళికి ముందు మీరు తనని అడగలేదా, స్వాతి అడిగేసింది..."అప్పుడు అవసరమైతే చేస్తానన్నట్టు చెప్పింది...అవసరానిదేవుంది...అదే వస్తుంది...టయోటా కారున్న వాడికి బిఎండబల్యూ కారవసరం...ఫ్యూటానున్న వాడికి లెదరు సోఫా అవసరం...దర్జా గా బతకటం అవసరమని తనే అర్ధం చేస్కుంటుంది లే అనుకున్నా...ఇప్పుడేమో మనకేం తక్కువ...ఇద్దరం రెక్కలు ముక్కలు చేసేస్కుని ఇంట్లో మనశ్శాంతి పోగొట్టేస్కునే కన్నా వున్న దాన్లో ప్రశాంతంగా పొదుపుగా బతకొచ్చుకదా అని వితండవాదం ఎప్పుడూ...ఏవిటో ఇలా అడ్డంగా దొరికిపోయాను" అని తెగ బాధ పడిపోయాడు.

 "బాధ పడకండి శ్రీకాంత్...తొందర్లోనే తను తెల్సుకుంటుంది లెండి...మాకు పరిచయం చెయ్యండి తనని...మమ్మల్నందర్నీ చూశాకా తనకి వుద్యోగం చెయ్యాలనిపిస్తుంది" అని స్వాతి అతన్ని ఓదార్చడం మొదలెట్టింది. ఎందుకో ఇంకక్కడ వుండాలనిపించక నాకు చాలా పనుంది స్వాతీ, అని త్వరగా లంచ్ ముగించేసి తన డెస్కు దగ్గరకొచ్చేసింది నందిని.

తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఎందుకో కాఫటేరియా సంభాషణ మనసుని వదలట్లేదు. శ్రీకాంత్ భార్య చెప్పినదాంట్లో అంత తప్పేవుంది అనిపిస్తోంది.  రోజూ ఈ అష్టావధానం తనవల్ల కావట్లేదని బోల్డు బాధపడుతుంది, ఈ స్వాతి కూడా ఏవిటి అతన్నే వెనకేసుకొస్తుంది...అసలు తామంతా విలాసాలని అవసరం గా పొరబడి బతికేస్తున్నామా...మనసుని వుక్కిరిబిక్కిరి చేస్తూ ఏవో అలోచనలు...అలోచనల్లోంచి మనసు నెమ్మదిగా జ్ఞాపకాలవైపు పరిగెడుతోంది.

తనకప్పుడు ఆరో ఏడో వుంటాయి..అమ్మమ్మ ఇంట్లో ...కరెంటు పోయినప్పుడు... చీకట్లో వుయ్యాలా బల్ల ఎక్కి... తనూ, పెద్దమ్మ కూతురూ...ఇద్దరూ పెద్దయ్యాక ఏమి అవ్వాలో తెగ చర్చించేస్కుంటున్నారు... ఆ గదిలో ఇంకెవ్వరూ లేరనుకుని."నేను బాగా చదువుకుని డాక్టరు అవుతా" అని ఒకళ్ళంటే "డాక్టరు ఐతే ఛీ రక్తం...అన్నీ చూడాలి బాబోయ్" అని అవతలి వాళ్ళూ..."పోనీ టీచరు ఐతే అనుకుంటే మనలాగే పిల్లలు మనల్ని తిట్టుకుంటారు"...అని రెండో వాళ్ళు..ఇలా వాళ్ళకి తెలుసున్న వృతూలన్నింటి గురించి చర్చించుకుంటుంటే ఇంతలోనే కరెంటు వచ్చేసింది...చూసేసరికి ఎదురుగుండా పందిరి మంచం మీద తమ మాటలకి నవ్వుకుంటూ తాతగారు. అయ్యో మా మాటలన్నీ వినేస్తున్నారా ఐతే ఇప్పటిదాకా అని బిక్కమొహాలు వేసిన తామిద్దర్నీ చూసి నవ్వుతూ తాతగారు "ఇలా రండర్రా మీకొక మాట చెప్పాలి" అని దగ్గరికి తీసుకున్నారు.

 అసలూ చదువుకోడం ఎందుకనుకున్నారు? అని అడిగారు...ఇది కూడా తెలీదా అన్నట్టు చూసి...వుద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించడానికి అన్నారిద్దరూ ఏకకంఠంతో...అది కాదర్రా...చదువుకోడం వెనకాల అసలుద్దేశం అది కాదు...జ్ఞానం సంపాదించడం...దాన్ని ఆస్వాదించడం...మన చుట్టూ వున్న వాటి విలువ తెలుసుకోవడం...వాటిని గౌరవించడం...మన జీవితంలో ఎన్నింటికో అర్ధాన్ని వెతకడం...ప్రహల్లాదుడు తన తండ్రి హిరణ్యకశుపుడితో ఏవన్నాడో తెలుసా...

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ

చదువుకున్నాక వుద్యోగం చెయ్యడం అన్నది అవసరం, అభిలాష వీటన్నింటి మీద ఆధారపడి వుంటుంది...కానీ మీరు గుర్తుపెట్టుకోవలసింది చదువు ప్రధానోద్దేశం డబ్బు సంపాదించడం కాదు...సంపాదన కోసమే ఐతే చదువుకోనక్కర్లేదు...మన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవచ్చు...ఆనందాన్ని ఎలా నిపుకోవచ్చు...మనమూ..మన చుట్టూ వుండేవాళ్ళూ సంతోషం గా comfortable గా ఎలా వుండొచ్చూ...ఇవి నేర్పడం విద్య ముఖ్యోద్దేశం...
                   
ఒక్కసారి ఈ లోకం లోకి వచ్చి నందిని టైము చూస్కుని...మళ్ళీ కంప్యూటర్ వైపు తిరిగి పనిలో పడిందే గాని బుర్ర పూర్తిగా పనిలో మునిగిపోలేకపోతోంది...అప్పుడు తాతగారు చెప్పింది వాళ్ళిద్దరికీ ఏమీ అర్ధం కాలేదు...అసలిప్పటికైనా అర్ధమైందా. ఏడేళ్ళ పిల్లల అలోచన కన్నా ఏమి పరిపక్వత వచ్చింది. ఇంకొకళ్ళతో పోల్చుకుంటూ...వాళ్ళ దారిలో పరిగెట్టడమే కానీ నిజంగా తమకేం కావాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించామా...దేనిలో సంతోషముందో అని వెతికి చూసిందా తనూ...అసలైన ఆనందానికి అర్ధమేవిటో ఎప్పుడైనా ఆగి అలోచించిందా తను...తను ఏరోజైనా ప్రశాంతంగా వుందా...తన చుట్టూ వున్నవాళ్ళని వుంచగలిగిందా...నందిని యంత్రం లా పని చేసుకుని పోతోంది...ఆలోచనల దొంతర్లు చెదిరిన గూటిలోంచి చెల్లా చెదరైన తేనెటీగల్లా మనసుని తలో వైపు లాక్కుపోతున్నాయి...

 పనితోనూ...ముంచెత్తుతున్న అలోచనల అలజడితోనూ విసిగిపోయి ఇంటికి చేరింది ఆరున్నరవుతుండగా...అప్పటికే ఇల్లు చేరి బంటిగాడి పేచీ ని పెద్దగా లెఖ్ఖచెయ్యకుండా టీవీ లో వస్తున్న football ని తీక్షణం గా తిలకిస్తున్న కిషోర్ "ఏవిటోయ్ ఇంత లేటు ...కాస్త కాఫీ నా మొహానపడేద్దూ "అన్నాడు నందిని మొహంలో విసుగుతో తనకేమీ సంబధం లేదన్నట్టు...బంటిగాడి అలకతీరుస్తూ వాడికేవో మాటలు చెప్తూ అలానే కాఫీ కలుపుకొచ్చి సోఫా లో కూలబడింది...కాఫీ పూర్తవ్వగానే రాత్రికేం చేస్తున్నావు..."నాకేమైనా మంచి స్పైసీ గా తినాలనిపిస్తోందోయ్...నువ్వు చేస్తావే స్టఫ్ చేసి దొండకాయ కూర అది చెయ్యకూడదూ"...కిషోర్ ఎప్పుడూ ఇది చెయ్యి అని ఆర్దర్ వేసినట్టు మాట్లాడడు...అలా అని చెసేదాకా వదిలీ పెట్టడు, చిన్న చిన్న విషయాలే కాదు..అన్నింటిలోనూ...ఈ సంగతి నందినికి అర్ధమవ్వడానికి పెళ్ళయ్యాక కొంత సమయం పట్టింది...అర్ధం అయ్యాక ఎప్పుడూ అతను ఏదైనా కోరాకా వాదించాలనో, బుజ్జగించాలనో ఎప్పుడూ ప్రయత్నించి కాలం వృధా చెయ్యలేదు. అలాగే అని సోఫాలోంచి లేచి వెళ్తూంటే వెనకనుంచి కిషోర్ "అదే చేత్తో సాంబార్ కూడా వుంటే"...అన్నాడు టీవీ వైపు నుంచి బుర్ర తిప్పకుండానే...

పడుతూ లేస్తూ...పరిగెడుతూ మధ్యలో బంటి గాడి పేచీలు తీరుస్తూ మొత్తానికి తొమ్మిదవుతుంటే వంట పూర్తి చేసి కంచం లో కూరా అన్నం...పక్కన కప్పులో సాంబారు వేసి కిషోర్ ముందు పెట్టి బంటిగాడికి తినిపించడానికి వెళ్ళబోతుంటే "అరెరే అప్పడాలు వేయించలేదా" అన్నాడు కిషోర్ నిరుత్సాహంగా. అప్పటిదాకా పక్కకి నెట్టి, పని కానిచ్చిన విసుగూ కోపం అంతా ఒక్కసారి వరద గోదారిలా కట్టలు తెంచుకున్నాయి నందినికి...ఏవిటి కిషోర్ నువ్వూ చూస్తున్నావ్ గా...వచ్చినదగ్గర్నుంచీ ఒక్క క్షణం కూడా కూచోకుండా చేస్తూనే వున్నాను...ఎంత పరిగెట్టినా తొమ్మిది లోపు బంటి గాడికి అన్నం పెట్టలేకపోతున్నాను. కనీసం వాడిని నా కాళ్ళకడ్డాం పడకుండా ఆడించడం కూడా చెయ్యవ్... ఇలా పొంగుకొస్తున్న కోపం, బాధా అన్నీ కలిపి మాటల్లో చెప్తుంటే, కిషోర్ మాత్రం చాలా ప్రశాంతంగా, "మా అమ్మ మరి సాంబార్ పెట్టినప్పుడల్లా అప్పడాలు వేయించేది ఆ అలవాటుతో" అంటూ, నందిని కళ్ళల్లోకి చూసి అక్కడే ఆపేశాడు.

నందిని వంట గదిలోకి వెళ్ళి బంటిగాడి కోసం అన్నం చల్లారబెడుతుంటే...కిషోర్ మళ్ళీ నెమ్మదిగా ..."మేవేమైనా అన్నీ నెత్తినేసుకుని చెయ్యమన్నావా...మీకంటే మేము అన్నీ చేసెయ్యగలం...మల్టీ టాస్కింగు మాకు వెన్నతో పెట్టిన విద్య అని పోటీకొచ్చి ఇప్పుడు చెయ్యలేక మానలేకా మా మీద గంతులేస్తే..." అని తనలో తనే అనుకుంటున్నట్టు నందినికి వినపడేలా అంటున్నాడు...

బంటిగాడికి అన్నం తినిపిస్తున్న నందిని కి కిషోర్ మాటలు తన చెవులు దాటి మనసుని తాకాయి...అప్పటిదాకా నీరసం...విసుగు వల్ల వచ్చిన కోపం, చికాకు ని పక్కకు నెట్టి  మనసు ఒక్కసారిగా అలోచనలో పడింది.

నిజవే వీళ్ళెప్పుడూ తమతో సమానమైన పనులు చేస్తే మీరు మాతో సమానమని వొప్పుకుంటామని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. మీరు మాపనులు చేస్తే , మేము మీపనులు పంచుకుంటామని ఏ అగ్రీమెంట్లూ రాయలేదు... సంసారపు బండి కి రెండు సమానమైన చక్రాల్ల భార్యా భర్తలు పనిని సమానంగా విభజించుకుని చేస్తున్నా...ఆడవాళ్ళని చిన్న చూపు చూడటం తో...తాము చేసే పని తక్కువ...వీళ్ళకి లాగే మనమూ సంపాదిస్తే నే మనకి గౌరవం అని మేమే అపార్థం చేసుకున్నట్టున్నాం. మీరు చేసేది కూడా మేము చెయ్యగలం అంటే అది కూడా ఆఖరికి వాళ్ళ requirement list లో చేరిపోయింది...

పన్లన్నీ పూర్తిచేసుకుని పక్కమీదకి చేరినా నందిని అలోచనల పరంపర మాత్రం కంటిమీదకి కునుకుని చేరనివ్వడంలేదు. అసలు తనకెన్ని అభిరుచులు వుండేవి...తనకి నచ్చిన ఒక పుస్తకం చదివి ఎన్నాళ్ళైంది..బంటిగాడితో హాయిగా ఆడుకుని ఎన్నాళ్ళైంది...తనూ కిషోర్ పోట్లాడుకోకుండా నవ్వుతూ ఒక గంట కబుర్లు చెప్పుకుని ఎన్నేళ్ళైంది...అమ్మెప్పుడూ వుద్యోగం చేసి సంపాదించుకుంటే స్వేఛ్ఛగా హాఇగా బతకొచ్చు అని నూరిపోస్తూ వుండేది...తను ఎంత స్వేఛ్ఛ్ గా...హాయిగా బతుకుతోంది...తను చదువుకుంది...చుట్టూ ఎవర్ని చూసినా వుద్యోగం చేస్తున్నారు...తనూ చెయ్యాలనుకుంది...కొత్త సంసారం లో , ఇంటి బాధ్యతలు అంత బరువనిపించలేదు..తనకీ సరదాగానే అనిపించింది...కానీ ఇంట్లో పనులు పెరుగుతున్నా అన్నీ చేసెయ్యాలనే అనుకుంది...తన comfort Jone గురంచి...చేస్తున్న పనిలో తృప్తి గురించి అసలు పట్టించుకుందా...తను చేస్తున్న పని వూపిరాడనివ్వని బందిఖానా లా అనిపించినప్పుడు ఇంక తను పొందుతున్న స్వేఛ్ఛ ఏవిటి? ఇలా అలోచనల్లో కొట్టుకుపోతున్న నందిని మనస్సు ఒక్కసారిగా స్ఠిమితపడింది......తను మర్నాడు ఆఫీసుకి వెళ్ళగానే చెయ్యాల్సిన పని ఏవిటో అర్ధమయ్యి...

                                                               *          *          *

అంతదాకా key board మీటల మీద చకచకా కదులుతున్న ధరణి వేళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. తను తీసుకోగలదా ఆ నిర్ణయం....ఇంటి mortgage, bank loan ఇవన్నీ ఇంక నీ బాధ్యతలే అని అంత సులువుగా తను తప్పుకోగలదా...తను రాస్తున్న కథకి ఈ ముగింపు ఇచ్చే హక్కుతనకి వుందా...ఇలా అలోచిస్తుండగానే లోపల్నుండి నీ offshore call అనుకుంటా...cell ఇక్కడ పడేసి అక్కడేం చేస్తున్నావ్...ఇప్పుడే కాస్త నిద్ర పడుతుంటే...అన్న శరత్ కేకతో వొళ్ళో వున్న PC ని పక్కన పడేసి ఒక్క వుదుటన లోపలకి పరిగెట్టింది ధరణి...

                                           

[తోచినవి రాసుకోటం తప్ప...కథ రాయటం నావల్ల కాదనుకున్న నన్ను...కథ రాయి...ప్రయత్నించు...రాయగలవు అని ఎంతగానో ప్రోత్సహించిన మాలతి నిడదవోలు గారికి కృతజ్ఞతలతో...]

11/29/11

తూర్పు వెళ్ళే మనసు




నల్లటి మెట్లు....మెట్లపక్కన పిట్టగోడ మీదుగా పాకిన సన్నజాజి పందిరి....మెట్ల మళుపుకి పక్కగా నల్లటి ఇనప చువ్వల కటకటాలు...దాని మీదుగా పాకిన రాధా మనోహరాల చెట్టు...వాటి మీదుగా ఇంకాస్త ముందుకి వెళితే బల్లల గది...గచ్చు బదులు బల్లలు పేర్చి కట్టిన డాబా పైన గది... నాకూ నాతో పాటూ నా cousines ముగ్గురూ, మాతో సమానం గా అల్లరి చేసిన పిన్నిలు, చిన్న మావయ్యా...మా అందరి వూహలకీ రెక్కలొచ్చిన పొదరిల్లు ఆ బల్లల గది. మా కలల ప్రపంచానికి తలుపులు తెరిచి స్వాగతం పలికిన హరివిల్లు ఆ గది... కాస్త గట్టిగా నడిచినా పెద్దగా చప్పుడు చేసి, కింద నుంచి పెద్దవాళ్ళ చేత "ఏవిటా అల్లరి?" అని అక్షింతలు వేయించి నవ్వుకున్న చిలిపి కిట్టయ్య లాంటి గది. చీమల్లా అలికిడి కాకుండా ఆ గదిలో దూరి, కట్టుకున్న పేక మేడలు...చెప్పుకున్న కబుర్లూ...కలబోసుకున్న స్కూలు అనుభవాలూ...చదివిన చందమామ కథలని నాటికలుగా మార్చి రాసుకుని, పెద్దవాళ్ళంతా చాయ్ తాగే వేళకి వాళ్ళముందు మా రాతలకి దృశ్య రూపం ఇచ్చేసి.. బుల్లి నటీ నటులుగా కొట్టించుకున్న చప్పట్లు...పోటా పోటీలుగా ఆడుకున్న అంత్యాక్షరులూ...తాతగారి పందిరి మంచం ఎదురుగా వుండే పెద్ద వుయ్యాలాతో చేసిన ఫీట్లూ, తగిలించుకున్న దెబ్బలూ...తాతగారితో కలిసి పెద్దవాళ్ళకి తీసిపోకుండా ఆడిన పేకాటలు...ఆయన పెద్ద విస్తరాకు కంచం...వెండిపువ్వుల పీట కోసం పడ్డ పోటీలూ, వాటిని తీర్చడానికి పెద్దాళ్ళ ఆపస్సోపాలూ...సంజె వేళ పెరట్లో చేసిన భోజనాలు...ఆటల మధ్య మా అలకలూ,పేచీలూ...మర్నాడు ఉదయానికి ఏమీ ఎరగనట్టు కలిసిపొయిన చిన్నారి స్నేహాలూ...ఇంచుమించు ఇరవై మంది పూటకో గంట మాత్రం వదిలే కుళాయి నీళ్ళతో సద్దుకుని మహదానందంగా గడిపిన ఎర్రటి ఎండాకాలం సెలవలు...ఆశా సౌధాలకి పునాదులు వేసుకున్న అమ్మమ్మ గారింటి జ్ఞాపకాలు...

పెరటి వేపు నల్లటి పెద్ద గేటు మీద పాకిన రాధామనోహరాలు...డాబా మీదుగా చూస్తుంటే కనబడే హరేరాం మైదానం...దాని మధ్యలో వుండే రాములవారి కోవెలా...దాని వెనకాలే వుందని నేను చాలా రోజులు భ్రమపడినా, దూరం గా వుండే నరసిమ్హస్వామి కొండ...డాబాపైన చెక్క కటకటాళ్ళ వరండా...ఒక్కో గోడకీ పది కిటికీలు వాటికి బుల్లి బుల్లి తలుపులూ వుండే కిటికీల గదీ...గది చుట్టూ బీరువాల్లో పేర్చిపెట్టిన తాతగారి అపురూపమైన ఆస్తి ...ఆయన పుస్తక సంపద...ఇంటి వెనకాల పెద్ద బావీ...పెరడంతా నీడనిస్తూ మావిడి చెట్టూ...పొద్దున్నే పలకరిస్తూ తులసమ్మ ఎదురుగా ముద్దమందారాల చెట్టూ...సెలవలకి ఎప్పుడొస్తానని నాలుగురోజుల ముందునుంచే వాకబు చేస్తూ , నేను వచ్చిన ఐదునిమిషాల్లో ప్రత్యక్షమయ్యి వాళ్ళతో ఆటలకి లాక్కెళ్ళిపోయే నా బుల్లి నేస్తాలూ...మధ్యాహ్నం గాళుపు కొడుతోందని ఇంట్లో పెట్టి ఎన్ని గడియలు వేసినా చల్లగా జారుకుని చెట్ల నీడలో ఆడిన గుజ్జినగూళ్ళు...పప్పు బెల్లాలతో చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు...మామ్మ చెలులతో కలిసి ఆడిన గవ్వలాటలూ...తాతగారిని మధ్యాహ్నం వేళ కునుకు తియ్యనివ్వకుండా వేసిన యక్ష ప్రశ్నలూ...ఆయన చెయ్యి  పట్టుకుని గర్వం గా చేసిన సాయంత్రం షికార్లూ...వీధరుగు మీద మామ్మ వడిలో తల పెట్టుకుని నూట యాభయ్యో సారి కూడా విసుగు లేకుండా రామాయణ కధ చెప్పించుకున్న వెన్నెల రాత్రులు...నా కోసం ప్రత్యేకం గా ఫ్రిజ్జు లోంచి గడ్డ పెరుగు తీసి చక్కెర చల్లి ఇచ్చే పక్కవాటాలో అద్దెకుండే ఆంటీ...నన్ను చూసి కేరింతలు కొట్టే ఆంటీ వాళ్ళ చిచ్చరపిడుగూ...మనసులో మెదిలినప్పుడల్లా కళ్ళలోకి సన్నటి నీటిపొరని మోసుకొచ్చే మామ్మ గారింటి జ్ఞాపకాలు...

ఇప్పుడా బల్లల గది లేదు...కిటికీల గది వుందో లేదో తెలీదు...భౌతికంగా శిధిలమైపోయినా జ్ఞాపకాల వాకిట్లో మాత్రం ప్రాణం పోసుకుని సజీవంగా వున్నాయి. ఆ రోజులు తిరిగి రాకపోవచ్చు...చెదరని ఆ జ్ఞాపకాల జల్లులు మాత్రం మనసు మీద దాడి చేసినప్పుడల్లా వాటితో పాటుగా బోలెడంత వుత్సాహాన్ని కూడా మూటకట్టుకుని తీసుకొస్తాయి...మనిషి ప్రయాణం పడమటికే ఐనా మనసు ఎప్పటికప్పుడు తూరుపు వెళ్ళే రైలు ఎక్కేస్తూనే వుంటుంది ఉదయ సంజె వెలుగుల్ని పలకరించి రావటానికి...మనిషి time machine ఎక్కి వెనక్కి వెళ్ళలేకపోవచ్చు...మనసు మాత్రం ఏ technology తో పని లేకుండా తనకి కావల్సినప్పుడల్లా రోజు వారీ పనుల్లోంచి విరామం తీసుకుని  రెక్కలు కట్టుకుని వెనక్కి ఎగిరిపోగలదు...జ్ఞాపకల వీధుల్లో షికార్లు కొట్టి తాజా పరిమళాలనద్దుకుని వర్తమానం వాకిట్లో వాలిపోగలదు...


 జ్ఞాపకాలు...కాస్త పరుగాపి చతిగిలబడి కళ్ళు మూసుకుంటే తలపుల ముంగిట్లో ప్రత్యక్షమయ్యే చెక్కు చెదరని  స్మృతుల తేనె చినుకులు...ఎప్పటికప్పుడు మనసుకి కొత్త వుత్తేజాన్ని ఇచ్చి పరుగులు పెట్టించడానికి దొరికే పని విరామాలు...తరవాతి తరాలకి "మా చిన్నప్పుడు" అని చెప్పుకోడానికి మనసుపొరల్లో నిక్షిప్తమయ్యే నిధి నిక్షేపాలు...విరగబూసిన రాధామనోహరాల సుగంధాన్ని తమతో పాటు మోసుకొచ్చే సీతాకోక చిలుకలు...

(ఈ మధ్యే అమ్మమ్మ వూరు వెళ్ళొచ్చిన cousine ముఖపుస్తకం లో పెట్టిన update తో...మనసులో మెదిలిన జ్ఞాపకాల పరంపర కి అక్షర రూపం.)

11/21/11

కనువిందు చేసిన బాపూ గీసిన రామరాజ్యం




నేనెప్పుడూ సినిమా రివ్యూ రాయలేదు...రాద్దామని ఏనాడూ అనుకోనూలేదు. ఇప్పుడు రాస్తున్నది రివ్యూ అనికూడా అనుకోవడంలేదు...శ్రీరామరాజ్యం చిత్రం చూసిన తర్వాత రెండురోజులయినా విడిచిపెట్టని ఒక అనుభూతిని నా బ్లాగుచదివే కొంతమందితోనయినా పంచుకోవాలని రాస్తున్నానంతే

రమణ గారి హంసగీతం అని ఒకాయన రాసిన రివ్యూలాంటిది చదివాక చూసితీరాలనిపించి మావారిని బతిమాలి మరీ లాక్కెళ్ళాను శనివారం సాయంత్రం...మావారు పెద్దగా సినిమాలమీద research ఏమి చెయ్యరు నాలాగ. రాముడి పాత్రలో కూడా బాలకృష్ణ తొడగొడతాడు చూడు అని ఏడిపిస్తూనే వున్నారు సినిమా మొదలయ్యేవరకూ...

ఒక్కసారి సినిమా మొదలయ్యాక మాత్రం రాముడూ సీతలమధ్యకి మమ్మల్నీ లాక్కువెళిపోయింది...చూస్తున్నంతసేపూ పెద్దగా analysis ల వైపు పోలేదు బుర్ర. చాలాకాలం తర్వాత లీనమైపోయాననిపించిన సినిమా...తెలుసున్న సీతారాముల కథే ఐనా రెండు మూడు చోట్ల కళ్ళు చెమర్చాయి. ఒక సినిమా చూస్తూ ఆ పాత్రకి connect ఐపోయి ఆ పాత్ర కష్టానికి కంటతడి పెట్టిన సినిమా ఈమధ్య కాలంలో చూసిన గుర్తు లేదు.(కొన్ని పాత సినిమాలు మళ్ళీ చూసినప్పుడు ఆ అనుభూతి మళ్ళీ కలిగిన సందర్భాలు చాలానే వున్నాయనుకోండి)

చూసి ఇంటికొచ్చినదగ్గరనుండీ ఆ పాటలే వింటున్నాం. అదీ సంగీతం...వాటి సాహిత్యం గురించి చెప్పాలంటే. చిన్న చిన్న మాటలతో ఎంతో అర్ధవంతం గా రాసిన జొన్నవిత్తుల గారి సాహిత్యానికి ఇళయరాజా ఇచ్చిన సంగీతం నాకైతే చాలా నచ్చింది. ఎక్కడా వాయిద్యాలు సాహిత్యాన్ని మించిపోయి మాట వినపడకుండా చెయ్యలేదు. చిన్న పిల్లలు కూడా చక్కగా పట్టుకుని పాడుకునేలా వున్నాయి పాటలు. బొమ్మాళీ నిన్నొదలా వొదలా అని నా కూతురు TV చూసి పాడేస్తుంటే చూసి బెంగపడే నాలాంటి తల్లులకి ఒక చిన్న relief.  ఈ పాటలు కొన్నిరోజులైనా TV ల్లో మారుమ్రోగితే ఇవి కాస్తైనా వంటపట్టించుకుటారుకదా పిల్లలు అన్న ఆశ.

సినిమా చూస్తున్నంత సేపూ అందులో నటులెవ్వరూ గుర్తురాలేదు...ఆ పాత్రలే కనిపించాయి. ఒక image వచ్చేసిన నటులందరితో వాళ్ళ మ్యానరిజంస్ ఎక్కడా బయటకీ రాకుండా నటింపచేసిన బాపూ గారికీ ఆయనకి గౌరవం ఇచ్చి, తోచినట్టు కాకుండా చెప్పినట్టూ , ఆయన గీసిన లక్ష్మణ రేఖ దాటకుండా నటించిన పెద్ద పెద్ద నటులందరికీ కూడా జోహార్లు చెప్పి తీరాలి.

ముఖ్యంగా చెప్పాల్సింది నయనతార గురించే. మిగిలిన వాళ్ళందరికీ పౌరాణికాల్లో కాస్తో కూస్తో అనుభవమైనా వుంది. నయనతార అనగానే ఇంక చూసినట్టే అనుకున్నవాళ్ళల్లో  నేనూ వున్నాను. కానీ చూస్తున్నంతసేపూ సీతమ్మే కనిపించింది. ఎంతో గౌరవం కూడా కలిగింది. చాలా హుందాగా తను సీత బాధని అనుభవించి మరీ చేసిందనిపించింది. అలాగే బాలహనుమంతుడిగా వేసిన చిన్నపిల్లాడు కూడా ఒదిగిపోయాడు. హనుమంతుడు మారువేషంలో సీతమ్మతో పాటే వుండిపోయాడని చేసిన మార్పు ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. పైపెచ్చు ఇలాగే చేసి వుంటాడేమో అనిపించింది. తాను గీసిన బొమ్మలతో పూర్వ రామాయణం మొత్తం పేర్లు పడుతున్నంత సేపూ చూపించటం కూడా ఎంతో చక్కగా వుంది.

మాటలగురించి చెప్పాల్సినదేముంది. రమణ గారి బుడుగు చదువుతూ పెరిగినదాన్ని. అది చిన్నపిల్లకోసం రాసినట్టే ఈ కాలం పిల్లలకి వాళ్ళకర్ధమవ్వటానికి ఆయన రాసిన సీతారాముల కధ అనిపించింది.

క్రితం సంవత్సరం మేము india వెళ్ళినప్పుడు దసరా రోజున  పండగ సందర్భంగా ఒక channel లోలవకుశ  వేస్తుంటే, పిల్లలకి ఆ సినిమా చూపించటానికి పెద్దవాళ్ళంతా నానా తంటాలు పడ్డారు. ఆఖరికి భయపెట్టి మరీ కూచోపెట్టాల్సొచ్చింది. కూచున్నారే గానీ బుంగమూతులు పెట్టుకుని ఎప్పుడైపోతుందిరా భగవంతుడా అన్నట్టు కూచుని మధ్యలో ప్రకటనలొచ్చినప్పుడు జాగ్రత్తగా ఒక్కొకళ్ళూ తుర్రుమన్నారు. వాళ్ళకి ఆ సినిమాలో మాటలు greek, latin లా అనిపించడంలో చిత్రమేమీ లేదు. లవకుశేగా మళ్ళీ తియ్యటమెందుకూ అనుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం ఇదేనేమో అనిపించింది. ప్రతీ తరంలో ఆ సమయానికి తగ్గట్టు ఒకసారి ఇలాంటి చిత్రాలు తీయటం మంచిదని. ఈ తరానికి కూడా తాము ఎంతగానో నమ్మిన సీతారాముల కధని చేర్చడమనే బాధ్యత తమ భుజాలపై వేసుకున్నారు బాపూరమణలు.

కనులకి విందు
చెవులకి ఇంపు
మనసుకి మధురానుభూతి...

ఇది రమణ రాసి...బాపూ గీసిన సీతారామ చరితం..

9/12/11

గుప్పెడంత ప్రపంచం



స్కూల్లో చదివే రోజుల్లో హెడ్ మాస్టారితో మొదలుకుని...నాకన్నా పైన, కింద తరగతి విద్యార్ధుల వరకూ తెలుగు మాస్టారి అమ్మాయి అని పిలుస్తుంటే తెగ వుడుక్కునే దాన్ని...నాకు పేరు వుంది గా అని..బురద రోడ్డు మీద జారి పడ్డప్పుడో...మొయ్యలేక మొయ్యలేక ఏ కూరల సంచో మోసుకొస్తున్నప్పుడో అయ్యో నువ్వు మాట్టారి గారి పాపవి కదమ్మా అంటూ చూసి ఎవరైనా వచ్చి సాయం చేసినప్పుడు అడగకుండా అప్పనంగా వచ్చిన ఆ దన్ను గొప్పతనం అప్పుడర్ధం అయ్యేది కాదు..

అమ్మమ్మ వూరికి వెళ్ళినప్పుడు...వుయ్యాలా తాతగారి అమ్మాయీ మనవరాలూనూ...అని దార్లో నే మొదలయ్యే పలకరింపులూ......మామ్మ గారింటికి వెళ్ళేటప్పుడు  మీ  అబ్బాయిగారూ వాళ్ళూ వస్తున్నారండోయ్ అని మాకంటే ముందుగానే ఇల్లు చేరిపోయే కబురులు...ఇవన్నీ చూసినప్పుడు కాస్త గర్వం గానే అనిపించినా ఏమీ కష్టపడకుండా వచ్చేసిన ఆ గుర్తింపు విలువ మాత్రం అప్పుడు అంతగా పట్టించుకోలేదు

జీవితపు నిచ్చెన పైకి ఒక్కో మెట్టూ ఎక్కుతూ......ఇంటి నంబర్లు తప్ప ఫలానా వాళ్ళ ఇల్లు అంటే ఎగా దిగా చూసే metropolitan city లకి తరలి పోతున్న కొద్దీ, ఆప్యాంగా పలకరించే పక్కింటి అత్తయ్య గారూ....ఆపదలో మేమున్నామంటూ తొంగిచూసే ఎదురింటి పిన్ని గారూ.... కష్టం సుఖం విని పెట్టే వెనకింటి వదిన గారూ కనుమరుగైపోతుంటే కొంచెం కొంచెం గా తెలిసొచ్చింది రక్త సంబధాలతో పని లేని ఆ బంధాల విలువ. నాన్నగారు వూరెళితే రాత్రికి సాయం పడుకునే పక్కింటి పెద్దమ్మలూ...అమ్మకి పని పడితే చక్కగా జడలు వేసి స్కూలుకి పంపే పిన్నమ్మలు...ఈ హడావిడి ప్రపంచలో వాళ్ళ వాళ్ళ పనుల్లో పడి పరిగెడుతూ జ్ఞాపకాల్లోనే ఆగిపోయారు...ఆఫీసు నుంచి రావటం కాస్త ఆలస్యం ఐతే పిల్లని చూసుకునే పొరుగింటి అమ్మమ్మలూ...వొంట్లో నలత గా వుంటే కాస్త కూరో నారో వండిచ్చే ఇరుగింటి మామ్మలూ కనిపించక నేటి "ఆధునిక స్త్రీ" ఆఫీసు తలనొప్పులకి తోడుగా కొండంత insecurity ని మనసులో మోసుకుంటూ పైకి గుంభనగా తిరిగేస్తూ ముఫ్ఫై యేళ్ళకే అరవయ్యేళ్ళకి సరిపడా రోగాలన్నీ కొనితెచ్చేసుకుంటోంది.....

ఎక్కడెక్కడి friends నో ఈ social networking పుణ్యమా అని భలేగా కలుస్తున్నాం కదా అంటే.....ఎప్పటివాళ్ళనో కలవటం బానే వుంది గాని నీ పక్కింట్లో వున్న వాళ్ళెవరో నీకు తెలుసా అన్నాడు నా cousin. నిజవే మరి...ఏడాదిన్నర గా అదే ఇంట్లో వుండి నా చుట్టూ వున్న ఇళ్ళల్లో వున్న వాళ్ళ మొహాలు కూడా తెలియని పరిస్థితి..ఇది నా ఒక్క దానిదే కాదు దాదాపు నా generation లో చాలా మందిది. మునుపటి రోజుల్లో వూళ్ళు చదువులు...ఇళ్ళూ ఎన్ని మారినా ఎక్కడికక్కడ కొత్త ప్రపంచం ఏర్పరుచుకో గలిగే వాళ్ళం కాబట్టి పాత స్నేహితులని కొన్నాళ్ళు గుర్తొచ్చి బెంగపడినా నెమ్మదిగా మర్చిపోగలిగేవాళ్ళం ...మరి ఇప్పుడూ ఇంటి చుట్టూ వున్న మొహాల ఆనవాలు తెలియవు...ఆఫీసుకి వెళితే శత్రు సైన్యం తో కలిసి కూచుని చదరంగం ఆడటమే...ఎవరి నవ్వు ముఖం వెనక ఏ ఆపద దాగివుందో తెలుసుకోవటం బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు. పాత స్నేహితులని వెతికి వెతికి పట్టుకుని వాళ్ళతోనే ముచ్చట్లాడుకోవటం వెనక...social networking సైట్లు దిన దిన ప్రవర్ధమానంగా వెలిగిపోవటం వెనక వున్న కారణం పక్కనే వున్న వాడితో సర్దుకుపోలేకపోవటం...రేపు ఏదైనా గొడవొస్తే ఎల్లుండి వాడి మొహమెలా చూడటం అని ఇవాళ ఆ మొహమెలా వుంటుందో తెలుసుకోకపొవటమే మంచిదని వూరుకోవటం. కప్పు పాలు...రెండు స్పూన్ల పంచదార అప్పడగటానికి, శ్రావణ మంగళవారం నోముకి ముత్తైదువులకీ కూడా Networking సైట్లనే పట్టుకుని వేళ్ళాడుతున్నామంటే ...మనకి కరువైన ఇరుగుపొరుగు ప్రపంచం మనల్ని చూసి వెక్కిరించినట్టనిపిస్తుంది...

తాతగారిని మా ఇంట్లో ఇంకో నాలుగు రోజులు వుండమని బ్రతిమాలుతుంటే ఇల్లు ఏమైపోతోందో అని మూడో రోజునుండి నసగడం మొదలెట్టి నాలుగో రోజుకల్లా కట్టిన తిరుగు ప్రయాణాలు..అమ్మమ్మా వాళ్ళని మావయ్య తనుండే చోటుకి తీసుకెళితే అక్కడ వూపిరాడటం లేదని నెలలోనే సొంత గూటివైపు తీసిన పరుగులు...అమ్మని America తీసుకొస్తే...రోజూ నాన్నతో మాట్లాడుతున్నా ఆయన నేను బ్రహ్మాండంగా వున్నానని చెబుతున్నా కాని కిటికీ దగ్గరే నిలబడి బయటకి చూసే తన దిగులు చూపులూ...వైద్య సదుపాయం పేరు చెప్పి పట్టణవాసం లో ఎంతగా ఇమిడిపోయారనుకున్నా...మా వూరికి వెళ్ళాగానే కళకళ్ళాడిపోయే  అత్తగారి మొహం... వీటన్నింటి వెనక తరచి చూస్తే కనబడే మనసుకి నచ్చని నిజం ..... వురకలూ పరుగుల ప్రవాహం లో కొట్టుకుపోతున్న తమ  పిల్లల కాన్నా ఎక్కువగా వాళ్ళంతా "miss" అయ్యింది...అవుతున్నదీ.... ఇవ్వాళేం వండారూ అంటూ చనువుగా తలుపు తోసుకొచ్చే పొరుగింటి పుల్లమ్మలనీ...ఈనాడులో ఏమి రాసాడో చూసారా అని తనతో మాట కలిపే ఎదురింటి సుబ్బారావుల్నీ...తాము సంపాదించి పెట్టుకున్న తమ గుర్తింపుని...పోగుచేసి దాచుకున్న పరిచాయాల పొదరిళ్ళని....నాకేంటంట లాంటి ఆలోచనలెరగని ఆ అనుబంధాలని...

పనసపొట్టు కూర నుంచి పన్నీర్ బట్టర్ మసాలా వరకూ...internet లో వెతికేసుకుని చేసేసుకో గలుగుతున్నాం, గోడ మీదనుంచి కేకేసి వొదినగారిని ఈ కూరలో ఆవ పెడతారా అని అడిగే పనిలేకుండా...వార్తల మీదా...సినిమాల మీద... నచ్చని బాసు మీదా నెట్ లోనే వాదనలూ చర్చలూ చేసేసుకో గలుగుతున్నాం, అరుగుమీద అప్పారావులతో అవసరం పడకుండా...పక్కవాడి జీవితంలో వేళ్ళూ కాళ్ళూ పెట్టకుండా వుండటమే మా గొప్పతనం అని జబ్బలు చరుచుకున్నా...net connection తో పాటే స్ఠంబించిపోయే జీవన సరళి ఎంత ప్రమాదకరమో కూడా అలోచించడం అవసరం....ప్రపంచం కుగ్రామమైపోయింది కానీ...అంతా ఒకే కుటుంబం లా వుండే కుగ్రామాల చిరునామాలు మాత్రం ప్రపంచీకరణలో పడి కొట్టుకుపోతున్నాయి...మన గుప్పెట్లోనే ప్రపంచం అని విర్ర వీగి గుప్పెట విప్పి చూసుకుంటే...కనిపించే మన ప్రపంచం ఆ గుప్పెడంతే...